శ్రీ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదన్న అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కోర్టు ముందు ఉన్న వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పింది. అంతేకానీ.. ఫలానా విధంగా తీర్పు ఇవ్వాలి.. ఫలానా విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును నిర్దేశించవద్దని తేల్చిచెప్పింది.

చంద్రబాబునాయుడికి షరతులు విధించాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై కౌంటర్ వేయాలని చంద్రబాబు న్యాయవాదులకు కోర్టు సూచించింది. సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పరిష్కరించేంతవరకు ఆయన రాజకీయ ర్యాలీలో పాల్గొనద్దని హైకోర్టు షరతు విదించింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించవద్దని విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీచేశారు.
చంద్రబాబునాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో సీఐడీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. షరతులు విధించాలని కోరింది. చంద్రబాబు ఎటువంటి పత్రికా సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని రాజకీయ ర్యాలీల్లో పాల్గొనకుండా చూడాలని, ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి హైకోర్టుకు నివేదికలు ఇచ్చేలా ఇద్దరు డీఎస్పీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు సుదీర్ఘంగా 13 గంటలకుపైగా ప్రయాణం చేసి ఉండవల్లిలోని తన ఇంటికి చేరుకున్నారు.